Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నియంత హిట్లర్ సౌమ్యంగా మాట్లాడితే...!

జర్మన్ నియంత అడాల్ఫ్ హిట్లర్ ప్రసంగాలలో ఉద్రేకపూరితమైన ఆయన గొంతు ఎలా ఉంటుందో విన్నాం. అయితే, మామూలుగా మాట్లాడిన సందర్భాలలో ఆయన గొంతు ఎట్లా ఉంటుందనేది మొన్నటి వరకు తెలియదు. కానీ, ఇప్పుడు తెలుసుకునే అవకాశం వచ్చింది. 1942లో నాజీ నాయకుడు హిట్లర్, సైనిక అధికారి కార్ల్ మన్నెర్హీయంతో జరిపిన వ్యక్తిగత సంభాషణలను ఫిన్నిష్ సౌండ్ ఇంజినీర్ థోర్ డామెన్ రహస్యంగా ఈ ఆడియో టేపులో రికార్డు చేశాడు. అధికారిక పుట్టినరోజు ప్రసంగాలు, మాన్నెర్హీయం ప్రతిస్పందనను రికార్డు చేసే ఉద్దేశంతో థోర్ డామెన్ ఆడియో రికార్డింగ్ చేపట్టారు. ఇందులో భాగంగా హిట్లర్, మాన్నెర్హీయం సంభాషణను కూడా 11 నిమిషాలపాటు రికార్డు చేశారు. వారి సంభాషణ అధికారిక విషయాల నుంచి వ్యక్తిగత విషయాలకు మళ్లగానే ఈ రికార్డింగ్ నిలిపేయాల్సి ఉంది. కానీ ఆయన ఒక నిమిషం పాటు వారి వ్యక్తిగత సంభాషణను కూడా రికార్డు చేశారు. ఈ ఆడియో టేపులో హిట్లర్ సౌమ్యంగా మాట్లాడితే ఎలా ఉంటుందో వినవచ్చు.'ఒక దేశం 35 వేల ట్యాంకులతో ముందుకు కదలనున్నట్టు ఎవరైనా చెబితే.. మీకేమైనా వెర్రా? అని నేను ప్రశ్నిస్తాను' అని హిట్లర్ అనడం ఈ ఆడియో క్లిప్పులో వినవచ్చు. సాధారణంగా హిట్లర్ తన వ్యక్తిగత సంభాషణలు రికార్డు చేయడానికి ఎవరినీ అనుమతించే వారు కాదని అంటారు. దీంతో ఆయన సాధారణ గొంతుతో మాట్లాడితే ఎలా ఉంటుందనేది ప్రపంచానికి తెలియదు. కాగా, 1950లో ఈ ఆడియో క్లిప్పు మొదట వెలుగులోకి వచ్చినప్పుడు అది హిట్లర్ గొంతు కాదని ప్రజలు అనుకున్నారట.

More Telugu News